05/05/2014
12న మున్సిపల్, 13న పరిషత్,16న సార్వత్రిక ఫలితాలు -బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో 6309 మంది జాతకాలు -రోజులు లెక్కపెడుతున్న అభ్యర్థులు - ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలు 12, 13, 16.. ప్రస్తుతం అందరి చూపూ ఈ మూడు తేదీలపైనే నెలకొంది. మార్చి 30న మున్సిపోల్స్‌తో మొదలైన ఎన్నికల జాతర, ఏప్రిల్ 6,11లలో పరిషత్ ఎన్నికలతో వేడెక్కి, 30న సార్వత్రిక సమరంతో ముగియగా, 6309 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో వరుసగా మున్సిపల్, పరిషత్, జమిలి ఎన్నికల ఫలితాలు రానుండగా, అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -టీ మీడియా, కరీంనగర్ (టీ మీడియా, కరీంనగర్):మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11తేదీల్లో పరిషత్, 30న సార్వత్రిక ఎన్నికలు ముగియగా, ఆయాచోట్ల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం, బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో వెలువడనున్న ఫలితాలపై అందరి దష్టీ నెలకొంది. సుప్రీం జోక్యంతో ఫలితాలు వాయిదా.. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏప్రిల్ 2న ప్రకటిస్తామని వెల్లడించిన అధికారులు, ఆ తర్వాత 9కి వాయిదావేశారు. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత వారంలోగా ప్రకటించాల్సి ఉన్నా ప్రధాన రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఫలితాలు ప్రకటిస్తే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న వాటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ రెండు ఎన్నికల ఫలితాలను వాయిదా వేసింది. తుది విడత సార్వత్రిక ఎన్నికలు ముగిశాక, ఈ నెల 12, 13, 16 తేదీల్లో ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తేలనున్న 6309 మంది భవితవ్యం.. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో మొత్తం 236 డివిజన్లు/ వార్డులుండగా, 2166 మంది పోటీపడ్డారు. 57 జడ్పీటీసీ స్థానాలకుగాను 365 మంది, 804 ఎంపీటీసీ స్థానాలకు (817 స్థానాల్లో13 ఏకగ్రీవం) 3576 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 168 మంది, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలో 34 మంది పోటీపడ్డారు. మొత్తం మీద 6309 మంది భవితవ్యం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఫలితాలపై ఉత్కంఠ.. కాగా వరుస ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థులకు నెలరోజులుగా ఎదురుచూపులే మిగిలాయి. మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి. పరిషత్, సార్వత్రిక అభ్యర్థులూ రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న 12, 13, 16 తేదీలపై అందరి దష్టీ నెలకొంది. గెలిచేదెవరో, ఓడేదెవరో ఆయా రోజుల్లో తేలనుండగా, మున్సిపల్, జడ్పీ ఫలితాల తర్వాత రాజకీయం రసకందాయంలో పడనుంది. చైర్మన్లు, చైర్‌పర్సన్ల ఎన్నికలెప్పుడో?! మున్సిపల్, పరిషత్ ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు చైర్మన్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగాల్సి ఉంటుంది. 16న సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆ తర్వాత నిర్వహిస్తారా? ఆలోగానే పూర్తిచేస్తారా? అనేదానిపై స్పష్టత కరువైంది. ఎన్నికల సంఘం నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఫలితాల లోపు చైర్మన్లను ఎన్నుకుంటే కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముండదు. ప్రస్తుత ఎంపీలకు మాత్రం వారు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటేసే అవకాశం కల్పిస్తారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత చైర్మన్ల ఎన్నికలు జరిగితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటేసే అవకాశం ఉంటుంది. లెక్కింపు ఇక్కడ.. -కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఈవీఎంలను సెయింట్‌జాన్స్ హైస్కూల్‌లో భద్రపరిచారు. 12న ఇక్కడే ఓట్ల లెక్కింపు ఉంటుంది. రామగుండం కార్పొరేషన్‌కు సంబంధించి గోదావరిఖని నూతన మున్సిపల్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు.జమ్మికుంట, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపును కరీంనగర్ మండలం చింతకుంట గురుకుల పాఠశాలలో, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల మున్సిపాలిటీల లెక్కింపును జగిత్యాల ప్రభుత్వ కళాశాలలో, పెద్దపల్లి నగరపంచాయతీ ఓట్ల లెక్కింపును రామగుండంలో చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. - పరిషత్ ఎన్నికలకు సంబంధించి, ఈ నెల 13న ఆయా డివిజన్ల పరిధిలో జరుగుతుంది. -సాధారణ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లిలోక్‌సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌లో చేపడతారు. ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరీంనగర్ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉంటుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజవర్గాల లెక్కింపు సెయింట్ ఆల్పోన్స్ పాఠశాలలో, పెద్దపల్లి లోక్‌సభ స్థానం, పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కింపు ఉజ్వల పార్కు సమీపంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఉంటుంది. ఈ మేరకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఆయా తేదీల కోసం అభ్యర్థులతోపాటూ ప్రజలూ ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.