28/03/2020
EMI లపై RBI మారటోరియం
"ప్రశ్నలు -జవాబులు"
- Rakesh Goud ( ARG Associates)
ప్రశ్న : మారటోరియం అంటే ఏంటి? దీనివలన లాభం ఏమిటి?
జ: మారటోయం అంటే ఇక్కడ రుణ గ్రహీతలకు తాత్కాలిక ఊరట అనుకోవచ్చు. ఇది ప్రస్తుతానికైతే 3 నెలలపాటు వర్తిస్తుంది. ఇప్పటికే తీసుకున్న అప్పులకు సంభందించి ఈ 3 నెలల కాలంలో EMI లను చెల్లించకపోయినా ఫర్వాలేదు. ఇకపోతే ..
ఈరోజుల్లో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపొయింది. గృహ, వాహన రుణాల నుంచి మొదలుకొని వ్యక్తిగత, చివరికి మొబైల్ తీసుకోవాలన్నా బ్యాంకు ఋణం పైనే చాలా మంది ఆధారపడిపోతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ఎఫెక్ట్ తో ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకుల్లోఉంది. లాక్ డౌన్ తో దేశం కేవలం ఈ 21 రోజుల్లోనే సుమారు రూ. 7 లక్షల కోట్ల మేర నష్టపోతుందని కేంద్ర ఆర్ధిక శాఖ అంచనా వేసింది. పనుల్లేవు. ఉద్యోగాల్లేవు. రాబడులు లేవు. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి వివిధ రూపాల్లో అప్పులు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే బ్యాంకు రుణ వాయిదాలను వచ్చే 3 నెలలపాటు చెల్లించకపోయినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆయా బ్యాంకులకు సూచించింది.
ప్రశ్న: ఆర్బీఐ సూచనలను బ్యాంకులు తప్పకుండా పాటిస్తాయని అనుకోవచ్చా?
జ; తప్పకుండా పాటించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించలేదు. తన పరిమితులమేరకు కేవలం సూచనలు మాత్రమే చేసింది. కానీ .. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ సూచనలను బ్యాంకులు ఆదేశాలుగానే పరిగణిస్తాయి. రుణ వాయిదాలు కట్టకపోయినా ఇబ్బదులేమీ రావు. అనుమానాలు అక్కర్లేదు.
ప్రశ్న: ఈ అవకాశం అనేది కేవలం బ్యాంకులకు మాత్రమే ఉంటుందా? లేక బజాజ్ ఫైనాన్స్ వంటి NBFC లకు కూడా వర్తిస్తుందా?
జ: అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు మాత్రమే కాదు. దేశంలో ఆర్బీఐ పరిధిలో పనిచేస్తున్న అన్ని NBFC లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇందులో శ్రీరామ్ ఫైనాన్స్ , సుందరం, ముత్తూట్, ఇండియా బుల్స్ .. ఇలా 10 వేల వరకూ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. చిన్నా, పెద్దా, లోకల్ బ్యాంకులు అన్నీ ఈ సూచనను పాటించాల్సిందే.
ప్రశ్న: నాకు ఒక బ్యాంకులో హౌజింగ్ లోన్ ఉంది. ప్రతీ నెలా 5 వ తేదీకి రూ. 20 వేలు EMI ఉంటుంది. అయితే నా బ్యాంకు ఖాతాలో ఇప్పుడు రూ. 25 వేల బాలెన్స్ ఉంది. ఆ మొత్తం సంగతేంటి? ఆ అమౌంట్ నా ఖాతాలో అలాగే ఉంటుందా? లేక EMI కింద బ్యాంకులు జమ చేసుకుంటాయా?
జ: ప్రభుత్వ రంగ బ్యాంకు SBI ఇప్పటికే ఈ 3 నెలలు EMI ల జోలికి వెల్లమని ప్రకటించింది. ఇదే పద్దతిని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుసరించే అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేటు రంగ బ్యాంకుల సంగతి చెప్పలేం. వాటి నుంచి ఇప్పటివరకూ ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొంతకాలం ఇంటికే పరిమితం అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మొత్తం బ్యాంకు ఖాతాలోనే ఉంచితే ఆయా బ్యాంకులు ఈ ఎం ఐ కింద జమ చేసుకునే అవకాశాలను తోసిపుచ్చలేం. ఏదైనా జరగొచ్చు. అందుకని ఇంటి అవసరాలకు అత్యవసరం ఉంటే EMI తేదీ వచ్చేలోపే ఆ మొత్తాన్ని ఏదో రూపంలో బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా చేసుకోవడం మంచిది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు.
ప్రశ్న: ఈ 3 నెలల EMI డబ్బులు మళ్లీ తిరిగి కట్టాల్సి ఉంటుందా? లేక మినహాయింపు ఇచ్చేస్తారా?
జ: ఈ మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిందే. ఎప్పుడు చెల్లించాలి అనేది ఆయా బ్యాంకులు క్లారిటీ ఇస్తాయి. ఒకవేళ రుణ కాలపరిమితి లోగానే చెల్లిచాల్సి ఉంటే 3 నెలల తరువాత వచ్చే EMI లలో అదనంగా ఈ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంటుంది. లేదా రుణ వాయిదాల చివర్లో మరో 3 నెలలు అదనంగా పొడిగిస్తారు. అంతేకానీ ఈ మొత్తం అనేది పూర్తిగా మినహాయింపు ఉండదు. తీసుకున్న రుణం మొత్తం వడ్డీతో సహా చెల్లించాల్సిందే.
ప్రశ్న: ఆర్బీఐ ఇచ్చిన వెసులుబాటు అన్ని రకాల రుణాలకు వర్తిస్తుందా?
జ: అవును. అన్నిరకాల రుణాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అనుమానాలు అక్కర్లేదు. మొబైల్, ఫ్రీజ్, టీవీ, గృహ, వాహన, పర్సనల్ తదితర అన్ని రకాల టర్మ్ లోన్స్ ఈ పరిధిలోకి వస్తాయి. క్రెడిట్ కార్డులపై మాత్రం ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రశ్న: EMI లను వాయిదా వేశారు. కానీ రెగ్యులర్ పేమెంట్స్ లేకపోతే క్రెడిట్ (సిబిల్) స్కోర్ దెబ్బతింటుంది కదా? భవిష్యత్తులో రుణాలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయి కదా?
జ: అలాంటి భయాలేం అక్కర్లేదు. ఈ సందర్భంలో సిబిల్ ఏజెన్సీలు కూడా ఆర్బీఐ సూచనలను పరిగణలోకి తీసుకుంటాయి. ఎవరికీ ఇబ్బంది ఉండదు.
Rakesh Goud
ARG Associates