08/12/2025
“పెట్టుబడికి మంచి గిట్టుబాటు రావాలంటే ఓపెన్ ప్లాట్ ఎక్కడ కొనాలి ?”
అన్ని భూములూ సిరుల్ని పండించవు. అన్ని ప్లాట్లూ మనకు లాభాల్ని తెచ్చి పెట్టవు. కొన్ని భూములు కొనగానే నెలల వ్యవధిలోనే మంచి డిమాండ్ చూపిస్తాయి. మరికొన్ని భూములు కొని సంవత్సరాలు, దశాబ్దం గడుస్తున్నా ఎటూ కదలిక ఉండదు. వాటిపై పెట్టిన అసలు పెట్టుబడికూడా తిరిగి రాని పరిస్థితి ఎదురౌతుంది. భూములపై, ప్లాట్లపై పెట్టుబడి పెట్టేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను మూటకట్టునే అవకాశం ఉంటుంది.
ప్లాట్ కొనేముందు మొదటగా చూడాల్సింది లొకేషన్ . మనం తీసుకునే ప్లాట్ నగర శివార్లలోని ఏదైనా వెంచర్లో ఉన్నట్టయితే ఆ ఏరియాకు దగ్గర్లో ఇప్పటికే ఏవైనా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయా ? లేదా అని ముందు పరిశీలించుకోవాలి. ప్రాజెక్టులనేవి ప్రభుత్వ లేదా ప్రైవేటు ఏవైనా అయి ఉండవచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు ఉండడం వలన ఆ ఏరియాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. నిర్మాణాలు జరుగుతాయి. పెద్దపెద్ద రోడ్లు వేస్తారు. స్కూళ్ళు, కాలేజీలు వస్తాయి. ఈ నేపథ్యంలో మన ప్లాట్ కు సహజంగానే భవిష్యత్తులో మంచి డిమాండ్ వస్తుంది.
అలా కాకుండా ఎక్కడో అటవీ ప్రాంతంలా ఉన్న ఏరియాల్లో కూడా కొందరు స్థిరాస్తి వ్యాపారులు అక్కడి గ్రామీణుల నుంచి ఎకరాల్లో కొన్ని రాళ్లు పాతేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి వెంచర్లు హైదరాబాద్ చుట్టుపక్కల చాలానే ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అక్కడి ప్లాట్ లపై పెట్టిన అసలు పెట్టుబడి కూడా రావట్లేదని అక్కడి కొనుగోలుదారులు అంటుంటారు. అందుకే తక్కువ ధరకు వస్తోంది కదా అని ఎందుకూ పనికిరాని భూములని కొనుగోలు చేయొద్దు.
మనం తీసుకోబోయే ప్లాట్ ఉన్న ప్రాంతంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ? అని పరిశీలించాలి. రోడ్లు, రవాణా సౌకర్యాలు, ఇతర కంపెనీలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. వీటిని అనుసరించే ప్లాట్ ను మనం కొనుగోలు చేస్తున్న ధర సరైనదేనా? కాదా ? అని అంచనా వేసుకోవాలి. గ్రాఫిక్ డిజైన్ లు చూపిస్తూ మాయమాటలు చెప్పే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మాటలు వెంటనే నమ్మేయొద్దు. వీలయితే ఆ చుట్టుపక్కల విచారణ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెబుతున్నట్టు భవిష్యత్తులో ఆ ప్రాంతానికి నిజంగానే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందా? డిమాండ్ ఎలా ఉండబోతోంది అని అడిగి తెలుసుకోవాలి.
సాధారణంగా మనం ప్లాట్ లను పేరున్న స్థిరాస్తి వ్యాపార సంస్థల నుంచి లేదా వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తాము. హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి సంస్థలైతే హెచ్ ఎం డీ ఏ, డీటీసీపీ లేదా వై టీ డీ ఏ పరిధిలో ఉండే వెచర్లనే ఎంచుకోవాలి. ఈ వెంచర్లలో ప్లాట్ లను అమ్ముతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ అనుమతుల విషయంలో చాలావరకు పక్కాగానే ఉంటాయి. అంతేకాకుండా సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి . వీటిలో రోడ్లు, ఎలక్ట్రిసిటీ, నీటి సరఫరా, అండర్ డ్రైనేజి, పార్కు డెవెలప్మెంట్, కాంపౌండ్ వాల్ , సెక్యూరిటీ ముఖ్యమైనవి . హెచ్ ఎం డీ ఏ వెంచర్లయితే మరింత పారదర్శకంగా ఉంటాయి. ప్లాట్ కు సంభందించిన అన్ని విచారణాలనూ ప్రభుత్వ వెబ్సైటు : www. hmda.gov.in లో చెక్ చేసుకోవచ్చు . లేదా హెచ్ ఎం డీ ఏ కార్యాలయానికి స్వయంగా వెళ్లి విచారించుకోవచ్చు. ఇలాంటి వెచర్లలో ప్లాట్ కొనుగోలు చెయ్యడం కోసం చాలా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా 60 శాతం మేర ఋణం కూడా మంజూరు చేస్తున్నాయి.