22/03/2017
ఎర్ర బుగ్గ వాహనంలో ప్రయాణం… సైరన్ వేస్తూ వెళితే చాలు ఎంతటి ట్రాఫిక్ ఉన్నా జనాలు ఆగాల్సిందే..! ఇక విదేశాలకు ట్రిప్పులకు వెళితే అందుకు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇదీ… నేడు మన నాయకులు అనుభవిస్తున్న వీఐపీ కల్చర్. దీంతో సామాన్య జనాలకు ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఎంతో విలువైన ప్రజాధనం వృథా అవుతుంది కూడా. అయితే దీనికి కొత్తగా ఏర్పడిన పంజాబ్ ప్రభుత్వం చరమ గీతం పాడింది. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అవేమిటంటే…
పంజాబ్‌లో ఇకపై ఏ ఎమ్మెల్యే, మంత్రి, ఆఖరికి సీఎం కూడా బుగ్గ కారు వాడకూడదు. సాధారణ వ్యక్తుల్లాగే ఉంటారు. అయితే ఎమర్జెన్సీ సందర్భాల్లో మాత్రమే అది కూడా పనిలో ఉంటే సీఎం, చీఫ్ జస్టిస్ వంటి వారు బుగ్గ కార్లలో వెళ్లవచ్చు.
విదేశాలకు ఎమ్మెల్యేలు లేదా మంత్రులు, ఆఖరికి సీఎం ట్రిప్పు వేసినా అందుకు ప్రభుత్వం డబ్బులు చెల్లించదు. వారే భరించాలి. ఒక వేళ ఆ దేశ ప్రభుత్వాలు ఆహ్వానిస్తే అప్పుడు మాత్రమే ప్రభుత్వం వారికి ఖర్చులు చెల్లిస్తుంది.
మన దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ హాస్పిటల్స్‌లో చూపించుకున్నా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ మెడికల్ ఇన్సూరెన్స్‌లతో ఖర్చులను స్వయంగా భరించాలి. అంతే కానీ వాటిని ప్రభుత్వం చెల్లించదు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు నెల నెలా ఇచ్చే జీతాల వివరాలు అన్నింటినీ తెలుపుతూ వెబ్‌సైట్‌లో సమాచారం పెడతారు. ప్రజలకు అది ప్రతి నెలా అందుబాటులో ఉంటుంది.
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ తమ తమ ఆస్తుల వివరాలను జూలై 1 వరకు వెల్లడించాలి. అదే వచ్చే ఏడాది నుంచి అయితే ప్రతి ఏటా జనవరి 1నే ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
శంకుస్థాపనలు చేసినప్పుడు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పుడు వేసే శిలా ఫలకాల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ప్రధాని, గవర్నర్ వంటి వారి పేర్లు తప్ప ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు ఉండరాదు.
ప్రభుత్వ ఖర్చులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సమావేశాలు, పార్టీలు నిర్వహించరాదు.
సీఎం, మంత్రులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా హంగు, ఆర్భాటాలు చేయరాదు. ఖర్చు ఎక్కువ పెట్టరాదు. అవసరం ఉన్న మేరకే నిధులు వాడాలి.
ప్రభుత్వ అధికారులెవరూ తమకు ఏవైనా సమస్యలు ఉంటే లేఖ రాయాలి తప్ప లాబీయింగ్ చేయకూడదు.
పైన చెప్పిన నిర్ణయాలను పంజాబ్ కొత్త సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా తీసుకున్నారు. ఈ మధ్యే జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయాలను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఈ రూల్స్ పంజాబ్‌లో అమలు కానున్నాయి. అయితే పంజాబ్‌లోనే కాదు, ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఇలాంటి వీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా పలు రూల్స్ అమలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే దేశమంతటా ఉంటే అప్పుడు సామాన్య జనాలకు కొంతలో కొంతైనా కష్టాలు తప్పుతాయి కదా.