03/06/2026
ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం రెపరెపలాడింది. మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం (APCNF)కు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పర్యావరణ పురస్కారం ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026 లభించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా, యావత్ భారతదేశానికీ గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారి దార్శనికత, మన రైతులు, గ్రామీణ మహిళల అంకితభావానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు ఇది. జూన్ 2న స్వీడన్‌లోని బస్తాద్ నగరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో మన వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ , రైతు సాధికార సంస్థ (RySS) కార్యనిర్వాహణ అధికారి తల్లం విజయ్ కుమార్ ఈ అవార్డును స్వీకరించారు.
ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఏపీసీఎన్‌ఎఫ్ ప్రపంచానికి నిరూపించింది. ప్రస్తుతం మన ప్రకృతి వ్యవసాయ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, జాంబియా దేశాల్లోనూ అమలవుతుండటం ఆంధ్రప్రదేశ్ రూపొందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ఆచరణీయమని నిరూపిస్తోంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళలు కుటుంబ స్థాయిలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకువచ్చి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్న 10 వేల మందికి పైగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రకృతి వ్యవసాయ శాస్త్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకుల సేవలు ఎంతో అభినందనీయం.
ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డును మన రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, గ్రామీణ మహిళలు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు అంకితం చేస్తున్నాం. ఈ విజయ ప్రయాణంలో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, క్షేత్రస్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది అందించిన సహకారం అమూల్యమైనది. ఈ కార్యక్రమానికి తోడ్పాటునందించిన కేంద్ర ప్రభుత్వానికి, కేఎఫ్‌డబ్ల్యూ జర్మన్ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, కో-ఇంపాక్ట్ సంస్థలతో పాటు అన్ని జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అంతర్జాతీయ గుర్తింపు ద్వారా ప్రపంచ దేశాలతో జ్ఞాన మార్పిడి, పరిశోధన భాగస్వామ్యాల విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. రసాయనాల్లేని ఆహారం, సుస్థిర వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలపడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది.